దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ హెచ్‌సీఎల్ భారీగా నియామకాలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 30,000 మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు సమాచారం. ముఖ్యంగా వీరిని కస్టమర్ ఔట్‌సోర్స్ టెక్నాలజీ, డెలివరీ సర్వీసుల్లో నియమించుకోన్నారు. ఈసారి పూర్తి స్థాయిలో ఇంజినీర్లను నియమించుకుంటామని గతంలో మాదిరిగానే ఏదో ఒక అంశంలో నిపుణులను నియమించుకోమని పేర్కొంది. ‘‘మాకు దాదాపు ఈ ఏడాది వృద్ధి రేటును నిలబెట్టుకోవాలంటే 25,000-30,000 వేల మధ్యలో మానవ వనరులు అవసరం’’ అని హెచ్‌సీఎల్ మానవ వనరుల విభాగం చీఫ్ అప్పారావు తెలిపారు.
సెప్టెంబర్ నాటికి కంపెనీలో 1,27,875 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండో త్రైమాసికంలో 3,754 మందిని నియమించుకొన్నారు. ఇదే క్రమంలో కంపెనీ 17 పెద్ద కాంట్రాక్టులను దక్కించుకొంది. వీటిల్లో డిజిటల్, అనలటిక్స్, క్లౌడ్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ వంటి సేవలు ఉన్నాయి.
ఇదే క్రమంలో హెచ్‌సీఎల్ అమెరికాకు చెందిన హెచ్1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించుకొంది. అమెరికాలో దాదాపు 65శాతం స్థానికులనే తీసుకొంది. కొత్తగా అమెరికాలో నియమించుకొన్న 17,000 మందిలో దాదాపు 64.7శాతం స్థానికులే ఉన్నారని సంస్థ చెబుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 640 హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకొంటే కేవలం 400కు అనుమతులు వచ్చినట్లు కంపెనీ చెబుతోంది.